పాల్వంచ, వెలుగు: దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 50 ఏండ్లు పైబడిన క్రీడాకారులు వచ్చి సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొనడం అభినందనీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో వారం రోజులుగా నిర్వహించిన ఇంటర్నేషనల్ సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు అందజేశారు.
వయసు పెరిగినా క్రీడలపై ఆసక్తి తగ్గకపోవడం, 75 ఏండ్ల వయసున్న వారు సైతం పోటీల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్ విజయవంతం కావడంలో ఫౌండర్ చైర్మన్ నల్ల సురేశ్‌రెడ్డి కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్రీడల శాఖ అధికారులు, టెన్నిస్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
